ఒడుదొడుకులున్నా.. లాభాలే - ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్ల దన్ను
ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో.. సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. ముడిచమురు ధరలు పుంజుకోవడం, రూపాయి బలహీనపడటం, జీడీపీ గణాంకాలు నిరాశపరచడం ప్రభావం చూపాయి.
ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు మాత్రం దన్నుగా నిలిచాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 88 పైసల నష్టంతో 70.46 వద్ద ముగిసింది. ముడిచమురు ధరలు మళ్లీ 60 డాలర్ల ఎగువకు చేరాయి. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి సమీక్షా సమావేశాలు ప్రారంభం కావడంతో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు.
అమెరికా, చైనాల మధ్య తాత్కాలికంగా రాజీ కుదరడంతో ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి. ఐరోపా షేర్లు అదే ధోరణిలో ట్రేడయ్యాయి.
సెన్సెక్స్ ఉదయం 36,396.69 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది.
అదే జోరు కొనసాగిస్తూ.. ఇంట్రాడేలో 36,446.16 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. అనంతరం అమ్మకాల ఒత్తిడితో డీలాపడిన సూచీ.. ఒకానొకదశలో 36,099.68 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరింది. మళ్లీ కోలుకుని చివరకు 46.70 పాయింట్ల లాభంతో 36,241 వద్ద ముగిసింది.
ఇక నిఫ్టీ సైతం 7 పాయింట్లు పెరిగి 10,883.75 పాయింట్ల దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 10,845.35- 10,941.20 పాయింట్ల మధ్య కదలాడింది.
సెన్సెక్స్ 30 షేర్లలో 18 లాభాలతో ముగిశాయి.
యెస్ బ్యాంక్ 4.92%, హిందుస్థాన్ యునిలీవర్ 4.12%, వేదాంతా 3.70%, ఎన్‌టీపీసీ 3.68%, అదానీ పోర్ట్స్ 2.61%, పవర్‌గ్రిడ్ 2.42%, భారతీ ఎయిర్‌టెల్ 2.15%, టాటా మోటార్స్ 2.01%, కోల్ ఇండియా 1.86%, ఓఎన్‌జీసీ 1.71%, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 1.48%, టాటా స్టీల్ 1.31%, మారుతీ సుజుకీ 1.24% చొప్పున రాణించిన వాటిలో ఉన్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా 3.79%, ఐటీసీ 1.14%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.02%, హీరో మోటోకార్ప్ 0.47% మేర నష్టపోయాయి.
Comments