నీరుకొండపై ఎన్టీఆర్ భారీ కాంస్య విగ్రహం
రాజధాని అమరావతి నీరుకొండలోని ఎత్తైన కొండపై ఏర్పాటు చేయనున్న ఎన్టీఆర్ స్మారక(మెమోరియల్) ప్రాజెక్టు ఆకృతులను ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపు ఖరారు చేశారు. కొండపై 32 మీటర్ల ఎత్తున నిర్మించే భవనంపై 60 మీటర్ల ఎత్తైన ఎన్టీఆర్ కాంస్యవిగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.
మొత్తం 200 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును పర్యాటక ఆకర్షక ప్రదేశంగా తీర్చిదిద్దనున్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్టు ఏర్పాటుచేసే కొండ చుట్టూ జలాశయాన్ని నిర్మించి ప్రాజెక్టు ప్రాంతాలను దీవిలా తీర్చిదిద్దుతారు. ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్టును పర్యాటకంగానే కాకుండా, వాణిజ్య కూడలిగాను అభివృద్ధి చేయడం ద్వారా ప్రాజెక్టు నిర్వహణకయ్యే ఆదాయాన్ని సొంతంగా సమకూర్చుకునే ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని చాలావరకు విరాళాల ద్వారా సేకరిస్తారు. దీని కోసం ప్రత్యేకంగా ట్రస్టు ఏర్పాటుచేస్తారు.
ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్టు ముఖ్యాంశాలివి..
* నీరుకొండలో ఏర్పాటు చేయనున్న ఎన్టీఆర్ కాంస్య విగ్రహం లోపలి భాగంలో పైవరకు వెళ్లి అక్కడినుంచి నగరాన్ని వీక్షించవచ్చు. సందర్శకులు పైకి వెళ్లేందుకు లిఫ్ట్‌లుంటాయి.
* జలాశయం దాటి కొండ వద్దకు చేరుకోడానికి బోట్లు ఏర్పాటుచేస్తారు. వాహనాలలో వెళ్లేందుకు కాజ్వే కూడా ఉంటుంది. ప్రాజెక్టులో ప్రధానంగా పది విభాగాలుంటాయి.
* కొండ దిగువ ప్రాంతంలో ఒక ప్రధాన జెట్టీ ఉంటుంది. అక్కడే ఒక ఫనిక్యులర్ రైల్వేస్టేషన్, ఓపెన్ ఎయిర్ థియేటర్, రెస్ట్రూమ్లు, ఫుడ్‌కోర్టు, సెల్ఫీపాయింట్ ఉంటాయి.
* కొండ దిగువ నుంచి కొండపైకి చేరుకోడానికి ఫనిక్యులర్ రైలు ఉంటుంది. ఎత్తైన ప్రదేశాలపైకి వెళ్లేందుకు ట్రాక్‌పై నడిచే కారునే ఫనిక్యులర్ ట్రైన్ అంటారు.
* ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుచేసే భవనంలో.. మ్యూజియం, ఆడిటోరియం, కేఫ్, ఫనిక్యులర్ స్టేషన్ ఉంటాయి.
* భవనం పక్కనే ఒక యాంఫీ థియేటర్ ఉంటుంది.
* కాజ్వే నుంచి ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుచేసిన భవనం వరకు వాహనాల్లో చేరుకోడానికి రోడ్డు మార్గం ఉంటుంది.
* కొండపైకి వెళ్లేందుకు నడక మార్గం, రెండో జెట్టీ వంటివి ఏర్పాటుచేస్తారు.
* కొండపై అరుదైన వృక్షజాతులతో ఉద్యానవనం ఏర్పాటుచేస్తారు.
Comments